ట్రంప్‌కు మెడిక‌ల్ టెస్టులు.. రిపోర్టులో ఏం వ‌చ్చిందంటే..!

  • ట్రంప్ పూర్తి ఫిట్‌గా ఉన్నారని వైద్య నివేదిక
  • శారీరకంగా, మానసికంగా ఆయన పనితీరు అద్భుతంగా ఉందని వెల్లడి
  • గత ఏడాదితో పోలిస్తే 6 కిలోల బరువు పెరిగినట్టు గుర్తింపు
  • మేధో సామర్థ్య పరీక్షలో ట్రంప్‌కు 30కి 30 మార్కులు
  • మధ్యంతర ఎన్నికల ముందు ట్రంప్ ఆరోగ్య నివేదికకు ప్రాధాన్యం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యంపై శ్వేతసౌధం కీలకమైన నివేదికను విడుదల చేసింది. ట్రంప్ 'అద్భుతమైన ఆరోగ్యంతో' ఉన్నారని, కమాండర్ ఇన్ చీఫ్‌గా బాధ్యతలు నిర్వర్తించడానికి 'పూర్తిగా ఫిట్‌'గా ఉన్నారని ఆ నివేదిక స్పష్టం చేసింది. మంగళవారం వాల్టర్ రీడ్ నేషనల్ మిలిటరీ మెడికల్ సెంటర్‌లో ట్రంప్‌కు వైద్య పరీక్షలు నిర్వహించగా, ఆయన వ్యక్తిగత వైద్యుడు డాక్టర్ సీన్ బార్బబెల్లా ఈ నివేదికను నిన్న‌ విడుదల చేశారు.

పరీక్షల అనంతరం ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ట్రూత్ సోషల్'లో స్పందిస్తూ, ప్రతి ఆరు నెలలకు జరిగే తన సాధారణ వైద్య పరీక్షలు పూర్తయ్యాయని, అన్నీ పర్ఫెక్ట్‌గా ఉన్నాయని పేర్కొన్నారు. వైద్య సేవలు అందించిన డాక్టర్లు, సిబ్బందికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ సమగ్ర వైద్య పరీక్షల్లో భాగంగా 22 మంది నిపుణులు సీటీ స్కాన్, క్యాన్సర్ స్క్రీనింగ్‌లతో పాటు ఇత‌ర‌ పలు పరీక్షలు నిర్వహించినట్లు నివేదికలో పేర్కొన్నారు.

నివేదికలోని ముఖ్యాంశాలు
నివేదిక ప్రకారం ట్రంప్ బరువు 108 కిలోగ్రాములుగా (238 పౌండ్లు) నమోదైంది. గత ఏడాది ఏప్రిల్‌లో నిర్వహించిన పరీక్షలతో పోలిస్తే ఇది 6 కిలోలు ఎక్కువ. ఆయన బాడీ మాస్ ఇండెక్స్ (BMI) 29.7గా ఉంది. వైద్యుల ప్రకారం బీఎంఐ 30 దాటితే ఊబకాయంగా పరిగణిస్తారు. ఈ నేపథ్యంలో ఆయన ఆహారం, శారీరక శ్రమ, బరువు తగ్గడంపై వైద్యులు కొన్ని సూచనలు చేశారు.

అదే సమయంలో ఆయన మేధో, శారీరక పనితీరు అద్భుతంగా ఉందని నివేదిక స్పష్టం చేసింది. మేధోపరమైన సామర్థ్యాన్ని అంచనా వేసే మాంట్రియల్ కాగ్నిటివ్ అసెస్‌మెంట్‌లో ట్రంప్ 30కి 30 మార్కులు సాధించారు. 2018, 2025లో నిర్వహించిన పరీక్షల్లోనూ ఆయన ఇదే స్కోరు సాధించడం గమనార్హం. మందుల వాడకం వల్ల ఆయన కొలెస్ట్రాల్ స్థాయిలు గణనీయంగా మెరుగుపడ్డాయి. 2018లో 223గా ఉన్న టోటల్ కొలెస్ట్రాల్, ఇప్పుడు 143కి తగ్గింది. ఆయన చేతులపై ఉన్న గాయాలను తరచుగా కరచాలనం చేయడం వల్ల కలిగే సాధారణ సమస్యగా వైద్యులు పేర్కొన్నారు. కాళ్లలో స్వల్ప వాపు ఉన్నప్పటికీ, గతేడాది కంటే పరిస్థితి మెరుగ్గా ఉందని తెలిపారు.

నివేదికకు రాజకీయ ప్రాధాన్యం
వచ్చే నెలలో 80వ పడిలోకి అడుగుపెట్టనున్న ట్రంప్, అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన అత్యంత పెద్ద వయస్కుడిగా రికార్డు సృష్టించారు. ఈ క్రమంలో త్వరలో జరగనున్న మధ్యంతర ఎన్నికలకు ముందు ఆయన ఆరోగ్యం, ఫిట్‌నెస్‌ను చాటిచెప్పే ప్రయత్నంలో భాగంగా ఈ నివేదికకు రాజకీయ ప్రాధాన్యం ఏర్పడింది. ఆయనకు ముందు అధ్యక్షుడిగా ఉన్న డెమొక్రాట్ నేత జో బైడెన్, వయసుపై ఆందోళనల నేపథ్యంలో 2024 అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్రంప్ తన శారీరక, మానసిక సామర్థ్యంపై ఎలాంటి సందేహాలకు తావులేదని చాటిచెప్పేందుకు ఈ నివేదిక దోహదపడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Donald Trump
Trump health
Trump medical report
Trump fitness
Walter Reed National Military Medical Center
Trump Truth Social
Trump BMI
US Elections 2024
Joe Biden

More Telugu News